అమరావతి : గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం(Dhavaleswaram) ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను (First danger warning ) కొనసాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద వల్ల ప్రాజెక్టులోకి 12.1 అడుగులకు వరకు నీటి మట్టం చేరుకుంది. సముద్రంలోకి పది లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు.
తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ప్రాంతాలకు 7,200 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. వారం, పది రోజులుగా ధవళేశ్వరం ఎగువ భాగంలో కురిసిన భారీ వర్షాలకు 16 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవాహం ధవళేశ్వరానికి రావడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడడంతో లంక గ్రామాలు ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వరదల వల్ల సుమారు 6వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 4వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది.