Vizag Steel Plant | విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్ఎంఎస్ -2 మిషన్‌లో మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగసి పడటంతో స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో లోపల కార్మికులు ఉన్నారా..? ప్రాణ నష్టం జరిగిందా..? ప్రమాదం ఎలా జరిగింది..? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. నాలుగు రోజుల క్రితం కూడా స్టీల్ ప్లాంట్‌లో పెనుప్రమాదం తప్పింది. ఆదివారం బ్లాస్ట్ ఫర్నెస్ -2లో సుమారు 300 ట్రక్కుల లిక్విడ్ స్టీల్ నేలపాలైంది. లిక్విడ్ స్టీల్‌ను ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్ కార్లోకి నింపి, ఎస్ఎంఎస్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో TLCకి రంధ్రం పడి లిక్విడ్ స్టీల్ కింద పడగా.. మంటలు చెలరేగి కేబుల్స్ కాలి, ట్రాక్ దెబ్బతింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజుల్లో మళ్లీ అగ్నిప్రమాదం జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.