తిరుమల : నో ఫ్లైజోన్గా ఉన్న తిరుమలలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ కలకలం సృష్టిస్తుంది. కొందరు వ్యక్తులు చిత్రీకరించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పశ్చిమ మాఢవీధి వరకు ఉన్న దృశ్యాలు, శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలు దగ్గరగా చిత్రీకరణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ వెంటనే స్పందించింది.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిశోర్ తెలిపారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. సదరు వీడియోను పరిశీలించిన అనంతరం ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.