విశాఖ: కుమారుడి మరణాన్ని తట్టుకేలేని ఓ తండ్రి.. అంత్యక్రియలు నిర్వహిస్తూనే కుప్పకూలి పోయాడు. కొడుకు మృతితో తీరని విషాదంలో ఉన్న తల్లికి.. భర్త మరణం మరింత విషాదాన్ని తెచ్చిపెట్టింది. కన్నకొడుకు, కట్టుకున్న భర్త దూరమవడంతో ఆ మహిళ దుఃఖానికి అంతం లేకుండా పోయింది. ఈ విషాద సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకున్నది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 61వ వార్డు మల్కాపురంలో అప్పారావు.. భార్య లక్ష్మి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నాడు. అప్పారావు హెచ్పీసీఎల్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ కూతుర్లకు పెండ్లిండ్లు చేశాడు. యానిమేషన్ కోర్సు చదువుతున్న కుమారుడు గిరీష్ అనారోగ్యంతో శనివారం మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన అప్పారావు.. కొడుకు మృతిని చూసి షాక్కు గురయ్యాడు. భార్యను ఓదార్చి అంత్యక్రియలకు సిద్ధమయ్యాడు. స్థానిక కోరమండల్ శ్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో అప్పారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఆయనను స్థానిక దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గంటల వ్యవధిలోనే కొడుకుతో పాటు భర్తను కోల్పోవడంతో లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది. కుమారుడి మృతదేహం పక్కనే తండ్రి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుంబంలో చోటుచేసుకున్న రెండు ఘటనలతో మల్కాపురం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.