తిరుమల : శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలందించేందుకు తిరుమల(Tirumala) లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ(Face recognition technology)ని అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో (TTD EO) ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని గదులు కేటాయించే కేంద్రాలు, ఉప విచారణ కార్యాలయాలను ఈవో గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో దళారీ వ్యవస్థ(Broker system)ను పూర్తిగా తగ్గించేందుకు, టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు సామాన్య భక్తులకు పూర్తిస్థాయిలో చేరేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఎంతగానో పయోగపడుతుందని చెప్పారు. తిరుమలలో సర్వదర్శనం(Sarvadarsan), లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో ఈ పరిజ్ఞానం ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా గదులను రొటేషన్ చేసే పద్ధతిని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చన్నారు.
గదుల కొరకు పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు త్వరితగతిన రూములు దొరుకుతున్నాయని తెలిపారు. రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.50కే ఉచిత లడ్డు టోకెన్లు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా లడ్డు ప్రసాదాలలో దళారి వ్యవస్థను కట్టడి చేయవచ్చని వివరించారు. అంతకుముందు ఈవో ఏఆర్పీ, సీఆర్వో, ఎంబీసీ 34 గదుల కేటాయింపు కేంద్రాలు, ఏఎంసీ, ఎస్ఎంసీ, టీబీసీ ఉప విచారణ కార్యాలయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈవో వెంట డిప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, భాస్కర్, ఏఈవో వెంకటేశ్వర్లు నాయుడు, ఓఎస్డీ రామకృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు.