తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి (Varalakshmi Vratham) భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 8 న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. ఈ కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్‌సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఇడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు.