Venkaiah Naidu | భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని తెలిపారు. కానీ నేడు వివాహ వ్యవస్థపై నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు. 56 ఏళ్లుగా బీజేపీకి సేవలందిస్తున్న సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభను విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఏ పని అయినా ఇష్టపడి చేస్తే.. కష్టం అనేది ఉండదని తెలిపారు.
రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వెంకయ్య నాయుడు సూచించారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరూ ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలియని స్థితి ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ మారే నాయకుల పరిస్థితి బస్సుల రాకపోకలాగా మారిపోయిందని విమర్శించారు. గతంలో నాయకులు ఒక పార్టీ విడిచి మరో పార్టీలో చేరడానికి సిద్ధాంతాలు కారణాలు ఉండేవని.. ఇప్పుడు డైపర్లు మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది రాజకీయాలకు తగదని వ్యాఖ్యానించారు.
ఒక పార్టీని నమ్మి, ఆ పార్టీ కోసం పనిచేసేవారే నిజమైన నాయకుడు అని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయంలో శ్రీమన్నారాయణ చాలామందికి ఆదర్శమని అన్నారు. జట్కా బండ్లపై తిరిగి వాజ్పేయి, అద్వానీతో ప్రచారం చేసిన రోజుల్లో నుంచే శ్రీమన్నారాయణ బీజేపీ పదవుల ఆశ లేకుండా, కేవలం నిబద్ధతతో పనిచేశారని గుర్తుచేశారు. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని తెలిపారు. రాజకీయ నాయకుల నడవడిక, పనితీరును ప్రజలు గమనించాలని సూచించారు. ఎదుటివారితో గౌరవ మర్యాదలు పాటిస్తే.. అదే గౌరవం మనకీ దక్కుతుందని తెలిపారు. కుటుంబమంతా కలిసి అన్యోన్యంగా ఉంటే ఆ బలమే వేరని పేర్కొన్నారు. శ్రీమన్నారాయణ అందరినీ గౌరవిస్తూ.. సహకరిస్తూ తన ప్రత్యేకతతో అందరికీ ఆప్తులుగా మారారని చెప్పారు.