దేశవ్యాప్తంగా కుదిపేసిన ఇండిగో సంక్షోభంపై వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దయ్యాయని విమర్శించారు. విమానాలు రద్దు అవ్వడంతో ప్రజలు ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముందస్తు సమన్వయం సమీక్షలు చేయకపోవడం వల్ల ఇండిగో వంటి ప్రధాన ఎయిర్‌లైన్స్ కుప్పకూలాయని తమ్మినేని సీతారాం అన్నారు. ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి రామ్మోహన్ నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ప్రతిష్ట దిగజారిపోయిందని అన్నారు. తన శాఖలోని పరిణామాలు అంచనా వేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సమస్య వచ్చినప్పుడు మొహం చాటేస్తే ఎలా అని ప్రశ్నించారు. మీ సమాధానం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని.. ఇప్పటికైనా మాట్లాడాలని డిమాండ్ చేశారు.
రామ్మోహన్ నాయుడిపై ఆముదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి చింతాడ రవికుమార్ విమర్శలు గుప్పించారు. రీల్స్‌పై ఆయన పెట్టిన శ్రద్ధ.. తన శాఖపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. కారెక్కినప్పుడు.. దిగినప్పుడు రామ్మోహన్ నాయుడు రీల్స్ చేస్తుంటాడని అన్నారు. అహ్మదాబాద్‌లో ఫ్లైట్ కూలి 240 మంది చనిపోతే.. అక్కడికి వెళ్లి కూడా రీల్స్ చేశాడని.. అందుకే ఆయన రీల్స్ మంత్రి అని పేరుతెచ్చుకున్నారని విమర్శించారు. రామ్మోహన్ నాయుడు చేతగానితనం వల్లే దేశ పరువు ప్రపంచస్థాయిలో దిగజారిందని అన్నారు.