అమరావతి : రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టనున్న రెండో విడత మహాపాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం లో మీడియాతో మాట్లాడారు. రైతులు మహాపాదయాత్ర అంటూ మళ్లీ డ్రామా మొదలు పెట్టారని ఆరోపించారు. ఉద్యమం పేరుతో వసూళ్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది నాటి చంద్రబాబు ప్రభుత్వమేనని అన్నారు. ప్రసుత్తం ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తు న్నామని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతిని ఉంచాలంటూ అమరావతి ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పరిరక్షణ సమితితో పాటు పలు ఉద్యమ సంఘాలు ఈనెల 12 నుంచి మహాపాద యాత్రను నిర్వహిస్తున్నాయి.
ఈ యాత్ర అమరావతి నుంచి అరసవల్లి వరకు జరుగనుంది. ఈ పాదయాత్రకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఉద్యమ నాయకులు నిన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.