ఆధారాలు లేకుండానే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని అడ్డమైన ఆరోపణలు చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తప్పు జరిగితే ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఏదో కంటితుడుపు కోసం ఇప్పుడు సిట్ వేశారని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రే ఆరోపణలు చేశాక.. ఇక సిట్ దర్యాప్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఏఆర్ ఫుడ్స్ నిజంగానే తప్పు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని డిమాండ్ చేశారు.
సనాతన ధర్మం గతంలో లేనట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని వెల్లంపల్లి విమర్శించారు. చెప్పులు వేసుకుని దీక్షలు చేయడం పవన్ కల్యాణ్‌కే చెల్లిందని అన్నారు. ఇలాంటి దారుణాలను మేం ఎప్పుడూ చూడలేదని అన్నారు. మాటలు చెప్పే ముందు సనాతన ధర్మాన్ని పవన్ కల్యాణ్ పాటించాలని సూచించారు.
నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్టు వచ్చిన రెండు నెలల వరకు దాన్ని ఎందుకు బయటపెట్టలేదని వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆ రిపోర్టు గురించి టీడీపీ ఆఫీసులో మాట్లాడటం ఏంటని నిలదీశారు. అసలు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రా? టీటీడీ ఈవోనా? అని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే రకమని విమర్శించారు. హరికృష్ణ మృతదేహం పక్కనే పొత్తుల గురించి చర్చించిన నీచ చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకాల నుంచి డైవర్షన్ కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. చేసిన తప్పును ఒప్పుకుంటూ చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని అన్నారు. చంద్రబాబూ నీ తప్పు ఒప్పుకో.. లేకపోతే వేంకటేశ్వర స్వామి ఒప్పుకోడని విమర్శించారు.