AP News | వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
బుడమేరుకు 1964లో వరదలు వచ్చినప్పుడు 10 మంది మరణించారని కాకాణి తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ గురించి చెప్పే చంద్రబాబు.. వరద తీవ్రతను ఎందువల్ల గుర్తించలేదని ప్రశ్నించారు. నీటిని విడుదల చేయాలని అధికారులు చెబుతున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని.. ఎందువల్ల పునరావాస కేంద్రాలకు తరలించలేకపోయారని నిలదీశారు.
హైదరాబాద్లో హైడ్రా కంటే ముందే ఏపీలో వైఎస్ జగన్ అక్రమ కట్టడాలను కూల్చడం ప్రారంభించారని కాకాణి గుర్తు చేశారు. హైడ్రా చర్యలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రశంసిస్తోందని.. అదే గతంలో అక్రమ కట్టడాలను పడగొడితే మాత్రం గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ మోకాలు లోతు వరద నీటిలో దిగి పరామర్శలు ప్రారంభించిన తర్వాతే చంద్రబాబు నీళ్లలోకి దిగారని అన్నారు.
వరద బాధితుల సహాయం అందించేందుకు వైసీపీ హయాంలో తీసుకొచ్చిన రేషన్ వాహనాలనే ఇప్పుడు వాడుతున్నారని కాకాణి అన్నారు. వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే ప్రకాశం బ్యారేజికి వైసీపీకి చెందిన బోట్లు వచ్చాయని చెబుతున్నారని అన్నారు. వరదల్లో ప్రాణాలు పోయిన అన్ని మరణాలను చంద్రబాబు హత్యలుగానే పరిగణించాలని అన్నారు.