Kakani Govardhan Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మాటల గారడీతో మభ్య పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. విజన్ 2047 పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కాకాణి మాట్లాడుతూ.. రంగురంగుల మేనిఫెస్టోలు, కలర్ పేజీల డాక్యుమెంట్లతో జనాలను మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఐదేళ్ల అబద్ధాలను నిన్న ఒక్కరోజే చంద్రబాబు చెప్పారని తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి, వృద్ధి రేటు గురించి ఏమాత్రం మాట్లాడలేదని అన్నారు. మాటల గారడీ చేసే చంద్రబాబు ఈసారి అంకెల గారడీ కూడా చేశారని దుయ్యబెట్టారు.
విజన్ 2047 కు సంబంధించి ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పగలడో.. అన్ని రకాలుగా చంద్రబాబు అబద్ధాలు చెప్పాడని కాకాణి విమర్శించారు. చంద్రబాబుకు తొండాట ఆడటం అనేది కొత్తేమీ కాదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మొండి చేయి చూపించడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని సెటైర్ వేశారు. అబద్ధాలు చెప్పడం.. అడ్డగోలుగా దొరికిపోవడం చంద్రబాబు నైజం అని కాకాణి విమర్శించారు. అయినప్పటికీ ఆయన తీరు మార్చుకోవడం లేదని అన్నారు. గత ప్రభుత్వం ఏ తప్పులు చేయలేదు.. అయినప్పటికీ లేదని తప్పుల్ని సృష్టించేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాడని మండిపడ్డారు.
.@ncbn తన మాటల గారడీతో మభ్యపెట్టాలని చూస్తున్నాడు
అబద్ధాలు చెప్పడం.. అడ్డగోలుగా దొరికిపోవడం చంద్రబాబు నైజం. అయినా తీరు మార్చుకోవడం లేదు
గత ప్రభుత్వం ఏ తప్పులు చేయలేదు. అయినప్పటికీ లేని తప్పుల్ని సృష్టించేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాడు
-కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,… pic.twitter.com/9qZSm56R5p
— YSR Congress Party (@YSRCParty) January 17, 2025
ఏడాదికి 15 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తామని చంద్రబాబు నాయుడు కోతలు కోస్తున్నాడని కాకాణి అన్నారు. పారిశ్రామిక నికర ఉత్పత్తి 11వ స్థానంలో ఉంటే.. జగన్ హయాంలో 9వ స్థానానికి వచ్చిందని తెలిపారు. అంటే జగన్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి పెరిగిందని పేర్కొన్నారు. తలసరి ఆదాయాల విషయంలో కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు తరహాలో అనాలోచిత వ్యాఖ్యలు చేసేవారిని మ దేశంలో జైలులో పెడతామని గతంలోనే స్విట్జర్లాండ్ మంత్రి ఒకరు అని గుర్తుచేశారు.