Gudivada Amarnath | విజయవాడలో వరద బీభత్సానికి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వరదల కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీటన్నింటినీ రాజకీయ హత్యలుగానే పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రం నడిఒడ్డున విజయవాడ ప్రాంతంలో అంత వరద వస్తుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
విజయవాడ వరద సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వరదల సమయంలో ప్రజల అవస్థలను పక్కనబెట్టి పూటకో ప్రెస్మీట్ పెట్టి ఈ విపత్తును పబ్లిసిటీకి చంద్రబాబు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను రక్షించడంపై లేదని మండిపడ్డారు. బుడమేరు కాల్వ నుంచి వరద వస్తుందని తెలిసి కూడా డీఈ హెచ్చరికలను లెక్క చేయలేదని తెలిపారు. 20 గంటల ముందు వరద వస్తుందని తెలిసి కూడా తాము స్పందించలేదని మరికొంతమంది అధికారులు చెప్పారన్నారు.
వరదల గురించి ముందే తెలిసినా ఎందుకు అప్రమత్తం చేయలేదని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వరద నిర్లక్ష్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగితే అది టీడీపీ ద్వారా జరిగినట్టు.. చెడు జరిగితే అది వైసీపీ ద్వారా జరిగినట్టు ఏపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుందని చంద్రబాబు విమర్శించారు.