Kiran Kumar Reddy | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారని, కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీతో అధికారం కట్టబెట్టారని గుర్తుచేశారు.
పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నివాసంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15వేల కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని.. ఇది పూర్తయితే 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని తెలిపారు. 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఎన్నో సమస్యలను ఎదుర్కొందని కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. ఆ తప్పులను సరిచేసిన, పాలనను గాడిలో పెట్టి, సుపరిపాలన అందించే విధంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఇక అమర్నాథ్ రెడ్డి తండ్రి కాలం నుంచి తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. చాలా ఏళ్లుగా అమర్నాథ్ రెడ్డి, తాను రాజకీయాల్లో ప్రత్యర్థులుగానే ఉన్నామని.. అయితే వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచి సంబంధాలే ఉన్నాయని పేర్కొన్నారు.