AP News | ఏలూరు జిల్లాలో స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్ అదృశ్యం కలకలం రేపుతోంది. శుక్రవారం నుంచి అతని సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ కామవరపుకోట, టి.నరసాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ బ్రాంచి (ఎస్బీ) కానిస్టేబుల్ సుబ్బారావు రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. కామవరపుకోటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒక్కడే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం బుట్టాయగూడెం నుంచి వచ్చి రాత్రి విధులు నిర్వహించారు. అనంతరం సుబ్బారావు ఫోన్ సిగ్నల్ కట్ అయ్యింది. అప్పట్నుంచి అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. దీంతో శనివారం సాయంత్రం కామవరపుకోట మండలం తడికలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరిసారిగా అటవీ ప్రాంతంలో అతని ఫోన్ సిగ్నల్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో తాడ్వాయి ఏజెన్సీ ప్రాంతంలో సుబ్బారావు ఆచూకీ కోసం పోలీసులు డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు.