తిరుమల : పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును ( Electric bus ) శనివారం టీటీడీ (TTD) కి విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట బస్సు తాళాలను డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు.ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాన్స్ పోర్ట్ డీఐ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు.

తిరుమల హుండీ ఆదాయం..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలోని 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని ఆలయ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 66,709 మంది భక్తులు దర్శించుకోగా 24,053 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.03 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.