AP News | తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఏదైనా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. శుక్రవారం నాడు వాసుపల్లి గణేశ్ మీడియాతో మాట్లాడుతూ.. తొలి వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అందుకే జగన్ మీద బుదర జల్లుతున్నారని ఆరోపించారు.
తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు జగన్ మీద ఓ నింద వేస్తేనే సరిపోతుందని అనుకుంటున్నారని వాసుపల్లి గణేశ్ అన్నారు. అందుకే లడ్డూ తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడితో పెట్టుకుంటే ఎవరూ బతకలేరని హెచ్చరించారు.
విజయవాడ వరదల మీద సీబీఐ విచారణ జరిపించాలని వాసుపల్లి గణేశ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే వరదలు వచ్చాయని అన్నారు. వరదల వల్ల 50 మరణాలు అంటే సామాన్య విషయం కాదని అన్నారు. వంద రోజుల పాలనలో కూటమి నేతలు ఒకరిని ఒకరు కీర్తించుకుంటున్నారని విమర్శించారు. వంద రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వరద బాధితులకు వైఎస్ జగన్ అయితే 25 వేలకు బదులు లక్ష రూపాయలు ఇచ్చేవారని చెప్పారు.
చంద్రబాబు పాలనలోనే తిరుమల లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు కలిపారని వాసుపల్లి గణేశ్ ఆరోపించారు. 2025లో మళ్లీ ఎన్నికలు వస్తాయని.. జగన్ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు.