కాచిగూడ : ప్రభుత్వం బీసీ రిజర్వేన్లు (BC Reservations) పెంచిన తర్వాతే సర్పంచ్, ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ,రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడలోని అభినందన్ హోటల్లో 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah ) హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతం వరకు పెంచుతామన్న హామీని నెరవేర్చాలని గుర్తుచేశారు. కులగణన చేపట్టి, బీసీలకు 50 శాతం రిజర్వేన్లు అమలు చేసిన అనంతరమే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కులగణన పట్ల సీఎం రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు దానకర్ణాచారి, నీల వెంకటేశ్,వేముల రామకృష్ణ, చంద్రశేఖర్, ఉదయ్, రఘుపతి, ప్రణితరాణి,రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.