By Elections | ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ క్రమంలో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక కోసం ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
తాజా షెడ్యూల్ ప్రకారం నవంబర్ 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21 వరకు తుదిగడువు విధించారు. ఇక డిసెంబర్ 5న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేయనున్నారు.