తిరుమల : తిరుమలకు వచ్చే భక్తులకు హోటళ్లలో (Hotels) పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలని టీటీడీ ఈవో(TTD EO) జె. శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో పెద్ద, జనతా క్యాంటీన్లు, ఏపీటీడీసీ(APTDC) హోటళ్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హోటళ్లతో సహా అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాలలో వ్యర్థాలను తొలగించేందుకు రెండు డస్ట్ బిన్ల వ్యవస్థను నిర్వహించాలని తెలిపారు. భక్తుల నుంచి అభిప్రాయాన్ని పొందడానికి ఫిర్యాదులు, సూచనల పెట్టెను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని హోటళ్లలో చెత్తను తడిచెత్త, పొడి చెత్తగా సేకరించాలన్నారు. హోటళ్ళు ఆహార పదార్థాల ధరలతో ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హోటల్ లైసెన్స్ పొందిన వారు వాటిని ఎటువంటి సబ్ లీజుకు ఇవ్వరాదని, సవరించిన ధరలను రెవెన్యూ విభాగానికి అందజేయాలని సూచించారు. వాటర్ బాటిళ్ల(Water Bottles) ను రూ.20కి మించి అమ్మకూడదని, తనిఖీ సమయంలో నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవోలు , జేఈవోలు, తదితరులు పాల్గొన్నారు.