అమరావతి : వైఎస్ జగన్ కారణంగా రాష్ట్రంలో వైద్యవిద్య(Medical education) రెంటికి చెడ్డ రేవడిలా మారిందని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తో జగన్ ప్రభుత్వం ఆడుకుందని దుయ్యబట్టారు. ఎక్స్ వేదిక ద్వారా ప్రకటనను విడుదల చేశారు. అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్(YS Jagan) సీఎం ఎలా అయ్యారని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి నాలుగేళ్లు నిండాయని, ఇప్పటికీ ఒక్కటి కూడా నిర్మాణనికి నోచుకోలేదని పేర్కొన్నారు. సగం పైగా పునాదుల దశలోనే ఉన్నాయని విమర్శించారు. కళాశాల హాస్టల్ భవనాలు పూర్తి చేయకుండానే గత సంవత్సరమే ఆర్భాటంగా రాజమండ్రి వైద్య కళాశాల(Medical College) ప్రారంభించారని, ఈ ఏడాది రెండో సంవత్సరం విద్యార్థులకు తాత్కాలిక భవనాలలోనే తరగతులు నడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల (Pulivendula) లో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదని వివరించారు. రెండోదశలో నిర్మించాల్సిన మరో 4 కాలేజీలు, మూడోదశలో నిర్మించాల్సిన 6 కాలేజీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని మంత్రి తెలిపారు. పాత మెడికల్ కాలేజీల్లో ఉన్న సిబ్బందిని కొత్త కాలేజీకి బదిలీ చేసి పాతవాటిలో వైద్య విద్య, వైద్య సేవల నాణ్యతను కూడా జగన్ ప్రభుత్వం చెడగొట్టిందని ఆరోపించారు. ఈ విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టకపోవడానికి కేవలం జగనే బాధ్యుడని పేర్కొన్నారు. కచ్చితంగా 17 మెడికల్ కాలేజీల్లోనూ ఆడ్మిషన్లు చేపడతామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో 90 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఎన్ఏబీహెచ్ గుర్తింపు కోసం పంపగా, 89 కేంద్రాలకు మంజూరు లభించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉన్నందున మరో కళాశాల నిర్మాణానికి సాయం కోరగా కేంద్రం సానుకూల స్పందించిందని చెప్పారు.