అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం (Polavaram ) ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బందోబస్తు కోసం ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులపై తేనెటీగలు ( Honey bees Attack) దాడి చేశాయి. ఆదివారం బాంబ్‌స్క్వాడ్ బృందం డీఎస్పీ రామకృష్ణ(DSP Ramakrishna ) ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు పోలవరం స్విల్‌వే గేట్ వద్ద తనిఖీ చేస్తుండగా తేనెటీగలు డీఎస్పీపై దాడి చేశాయి. దీంతో అతడికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది.
ఎన్నికల్లోనూ ప్రధాన హామీలో ఒక్కటైన పోలవరం జాతీయ ప్రాజెక్టు పోలవరానికి కేంద్రం అత్యధికంగా నిధులు ఇస్తుండడంతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబు ( Chandrababu) ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
ప్రతి వారం ప్రాజెక్టును సందర్శిస్తానని అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఆరు నెలల కాలంలో రెండోసారి సోమవారం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రం వాల్ పనుల గురించి ప్రాజెక్టు వద్ద అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. 2016 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది.