Margani Bharat | కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదని.. కేవలం అక్కడ ఫొటోలు దిగి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరద బాధితులకు ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయడం లేదని మార్గాని భరత్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పరిహారం, రేషన్ అందించడంలో ముందున్నామని తెలిపారు. అదే కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కూడా చేయలేదని విమర్శించారు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రికి తీసుకొచ్చి షో చేశారని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వాలంటీర్లకు రూ.10వేల స్టైఫండ్ ఇస్తామని చెప్పి మొత్తం వ్యవస్థనే నిర్మూలించారని మార్గాని భరత్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నిరుద్యోగ భృతి ఊసెత్తడం లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఎత్తేస్తాడేమో అని అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకానికి మంగళంపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కన్నా డ్రామాలు ఆడేవాళ్లు నయమని విమర్శించారు.