అమరావతి : ఏపీలో సంచలనంగా మారిన సాయికృష్ణ ( Saikrishna ) అదృశ్యంపై మొదటి నుంచి అనేక అనుమానాలున్నాయని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా( Former Minister Roja) ఆరోపించారు. తాజాగా కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ ( CCTV Footage ) మాయం అయిందన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ట్విట్టర్లో ఆరోపించారు. సాక్ష్యాలే మాయం అయితే నిజం ఎలా బయటపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు.
సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని కాపాడలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలని, సీసీటీవీ ఫుటేజీ మాయంపై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదని పేర్కొన్నారు. గత వారం రోజులుగా సాయికృష్ణ కేసు ఏపీలో హాట్‌టాపిక్‌గా నడుస్తుంది. విచారణ పేరిట సీఐ నాగరాజు కృష్ణలంక పీఎస్‌కు తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేసి లాకప్‌డెత్ చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
సాయికృష్ణ అదృశ్యంపై స్పందించిన ప్రభుత్వం సీఐను సస్పెండ్ చేయడంతో పాటు సిట్ విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా సీఐ నాగరాజును ఇంటిలో పోలీసులు అదుపులోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలిస్తుండగా ఆయన మద్దతుదారులు ఆందోళన నిర్వహించి అడ్డుకునేందుకు యత్నించారు.