తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం, ఆపద మొక్కుల వాడు తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామికి దాతల నుంచి విరాళాలు (Donations ) వెళ్లువెత్తుతున్నాయి. నిన్న పంజాబ్ పారిశ్రామికవేత్త రాజిందర్ గుప్తా రూ. 21 కోట్లను అందజేయగా హైదరాబాద్‌లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి రూ.51,09,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ (SV Annaprasadam Trust, ) కు విరాళాన్ని అందజేస్తూ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి చెక్కును అందించారు.
అదేవిధంగా టీటీడీ ఉద్యానవన విభాగానికి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వారు రూ.4.10 లక్షల విలువైన ఎరువులను అందించారు. కోరమండల్(Koramandal) ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఆర్ఎం రమణారెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్ మురళి ఈ మేరకు ఎరువులను తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగం కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులుకు అందజేశారు.
తిరుమల, తిరుపతిలోని ఉద్యానవనాల్లో మొక్కల పెంపకానికి ఈ ఎరువులను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మధు, అనిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.