అమరావతి: నిన్న గుండెపోటుతో మృతి చెందిన టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు ముగిసాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ పట్నంకు వెళ్లిన శేషాద్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని తిరుపతికి తరలించారు. మంగళవారం సాయంత్రం శేషాద్రి నివాసం నుంచి బయలుదేరిన అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు, భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు.
అనంతరం తిరుపతి వైకుంఠ ప్రస్థానంలో శేషాద్రి సోదరుడు రామానుజం తల కొరివి పెట్టారు. ఈ అంతిమయాత్రలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి , ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం సహా, ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి శేషాద్రి పార్థీవ దేహానికి పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు.