Heavy Rains | ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. గుంటూరు జిల్లాలో వరద నీరు రైలు పట్టాలపైకి వస్తుండటంతో.. ఆయా మార్గాల్లో రైళ్ల వేగం తగ్గించి నడపాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా గంటకు 30కి.మీ. వేగంతో మాత్రమే రైళ్లను నడపాలని తమ సిబ్బందికి అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రైలు పట్టాల వెంబడి వరద నీరు ప్రవహిస్తోంది. వేజెండ్ల-మణిపురం మధ్య వంతెన-14 వద్ద, పిడుగురాళ్ల-బెల్లంకొండ మధ్య 59వ నెంబర్ వంతెన వర్షపు నీరు ప్రమాద హెచ్చరిక మార్క్‌ను చేరుకుంది. ఈ నేపథ్యంలోనే రైళ్ల వేగాన్ని తగ్గించి నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సిబ్బంది కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని.. వరదనీరు తగ్గిన తర్వాత మళ్లీ సాధారణ వేగంతో రైళ్లను నడిపిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.