అమరావతి : రింగు వలల విషయంలో ఆ రెండు గ్రామాల మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. విశాఖ జిల్లా పెద్దజాలరిపేటకు చెందిన మత్స్యకారులు మారణాయుధాలతో దాడి చేసి ఆరుబోట్లను తగులబెట్టారని వాసవాణిపాలెం మత్స్యకారులు ఆరోపించారు. వలలను సైతం కాల్చివేశారని మండిపడ్డారు. ఇరుగ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రెండు గ్రామాల్లో భారీగా మోహరించారు. ముందస్తుగా గ్రామాల్లో 144 సెక్షన్ను విధించారు.
గత మూడు నెలల క్రితం రింగువలలో చేపలు పట్టవద్దని సాంప్రదాయ మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పాటు బోట్లను దగ్ధం చేసుకున్నారు. ఈ వివాదం వారం రోజుల పాటు కొనసాగడంతో అప్పట్లో జిల్లా అధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించారు.
మళ్లీ కొంతమంది రింగ్ వలల ద్వారా చేపలు పడుతుండడంతో వివాదం మొదలై బోట్ల ధ్వంసం వరకు వచ్చి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో విశాఖ ఏసీపీ మూర్తి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చి ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నారు. సముద్రంలోకి తాత్కాలికంగా చేపల వేటపై నిషేదం విధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.