అమరావతి : విశాఖ స్టీల్ (Visakha steel) ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస వర్మ (Union Minister Srinivasa Varma) స్పష్టం చేశారు. ప్లాంట్‌ను, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఢిల్లీలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల వైపల్యాలు, వారి సొంత ప్రయోజనాలు, నాయకుల మెప్పు కోసం స్టీల్‌ప్లాంట్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. వారి వల్లే విశాఖ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నష్టాల్లో నడుస్తున్న సంస్థలను పదేపదే నడపటం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని అన్నారు.
విశాఖ స్టీల్‌ను శాశ్వతంగా నడిపేందుకు కేంద్రం సహాయం చేస్తూనే ఏ విధంగా లాభాల బాటల్లోకి తీసుకువచ్చేందుకు అన్ని కోణాల్లో ఆలోచించుతున్నామన్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామి, ఆర్థిక మంత్రి నిర్మలసీతరామన్కు ప్లాంట్‌పై పూర్తిగా అవగాహన ఉందన్నారు. విశాఖ స్టీల్‌ను లాభాల బాటలో పట్టించేందుకు సెయిల్ అనే సంస్థతో సమావేశం జరిగిన మాట వాస్తవమని పేర్కొన్నారు.
అయితే సెయిల్‌లో విలీనం వల్ల వచ్చే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విశాఖలో ఉద్యోగులు ఎక్కువ, ప్రొడక్షన్ తక్కువ కారణంగా నష్టాల్లో నడుస్తుందని అన్నారు. సమర్ధవంతమైన అధికారులను నియమించి లాభాల బాట పట్టించడానికి తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నానని శ్రీనివాస వర్మ వెల్లడించారు.