అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఐసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు (Raghurama Krishna Raju) పక్కపక్కనే కూర్చుకున్నారు. కాసేపు ఇద్దరు సంభాషించుకున్నారు. జగన్ చెవిలో ఏదో చెబుతూ రఘురామ కనిపించారు. అయితే జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడే రఘురామ.. ఇప్పుడు ఆయన పక్కనే కూర్చోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారనే విషయమై చర్చ జరుగుతున్నది.
అయితే సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని జగన్‌ను కోరారని రఘురామ చెప్పారు. రెగ్యులర్‌గా వస్తానని, మీరే చూస్తారుగా అని జగన్ అన్నారని వెల్లడించారు. అసెంబ్లీ హాల్లో జగన్ తన భుజంపై చేయి వేసి మాట్లాడారని, కనిపించిన వెంటనే పలకరించారని తెలిపారు. మాజీ సీఎం పక్కనే తనకు సీటు కేటాయించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ను కోరానని వెల్లడించారు. కాగా, గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ.. సొంత పార్టీపైనే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసేవారు. ప్రభుత్వంపై, జగన్ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు.