అమరావతి : రాష్ట్రంలో నియంత పాలన (Dictators) కొనసాగుతుందని వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని వైసీపీ (YCP) నాయకులు ఆరోపించారు. చరిత్రలో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని, మీరెంత అంటూ కూటమి నాయకులను హెచ్చరించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు మానుకోవాలని, సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి ఆర్కె రోజా (Roja Selvamani) మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తదితరులు సోమవారం తిరుపతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు.
పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే కనీస స్పందన లేదని విమర్శించారు. ఫిర్యాదు రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ కూటమికి సెల్యూట్ కొడుతుందని, మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ మూడు సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయాలని సూచించారు. పోలీసులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని వెల్లడించారు.
తప్పులు చేసి తప్పించుకోవడంలో, వ్యక్తిత్వ హననంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. వైసీపీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులను చేయడానికి ఫేక్ ఐడీలు సృష్టించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు. వైసీపీకి పోరాటాలు కొత్త కాదని , ప్రభుత్వం తప్పుడు విధానాలకు పాల్పడితే చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారని విమర్శించారు. ఐదు నెలల కాలంలో సుమారు 7,200 మంది ట్రాఫికింగ్ జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాలన చూస్తుంటే హిట్లర్, గఢాపి పాలన గుర్తొస్తుందని ఆరోపించారు.