Srisailam | శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని తీర్మానించింది. దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకు ప్రొటోకాల్ దర్శన విధానంలో మార్పులు తేవాలని శ్రీశైలం దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. దీని ప్రకారం దేవస్థానాన్ని సందర్శించే ప్రముఖులకు దర్శన వేళలను సవరించినట్లు శ్రీశైలం ఈవో లవన్న తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 6.15 గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి 7.30 గంటల వరకు మాత్రమే వీఐపీ దర్శనానికి అనుమతి ఇవ్వాలని శ్రీశైలం దేవస్థానం నిర్ణయించింది. వీఐపీ దర్శనానికి వచ్చే వారికి విరామ దర్శనం, కుంకుమార్చన, అభిషేకం జరిపించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న స్పర్శ దర్శనం వేళలు ఉదయం ఏడు గంటల నుంచి 8.15 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.15 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు యధావిధిగా కొనసాగుతాయి. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ఉచిత స్పర్శ దర్శనం కూడా యథాతథంగా కొనసాగుతుంది. అయితే, భక్తులు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రెండు గంటల మధ్య క్యూ కాంప్లెక్స్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఆలయ దర్శనానికి వచ్చే ప్రముఖులు రెండు రోజులు ముందుగా తమ పర్యటన వివరాలను దేవస్థాన పాలక మండలికి తెలియజేయాలి. ఇతరులకు వసతి, దర్శనం, అర్జిత సేవల కోసం సిఫారసు చేస్తూ వీఐపీలు పంపే ఎస్సెమ్మెస్, వాట్సాప్ సందేశాల విధానాన్ని శ్రీశైలం దేవస్థానం రద్దు చేసింది. వసతి గదులు, దర్శనం, అర్జిత సేవల కోసం సిఫారసు చేసే ప్రముఖులు తమ లెటర్‌హెడ్‌పై రెండు రోజుల ముందుగా (రాత్రి 9 గంటల వరకు) విధిగా దేవస్థానానికి పంపాల్సి ఉంటుంది. ఈ లేఖలు protocol@srisailamdevastanam.org అనే ఈ-మెయిల్‌కు పంపాలి. ఈ లేఖలు ప్రొటోకాల్ వాట్సాప్ నంబర్ 91600 16215కు పంపాలి. ప్రస్తుతం ప్రముఖులంతా తమ సిఫారసు లేఖలను దేవస్థానం కార్య నిర్వహణాధికారికి పంపుతున్నారు. కానీ, ఇక నుంచి ప్రొటోకాల్ వాట్సాప్ నంబర్ ఫోన్‌కే ఆ సిఫారసు లేఖలు పంపాలని శ్రీశైలం దేవస్థానం సూచించింది. ప్రముఖులు పంపే సిఫారసు లేఖలో తమకు అవసరమైన వసతి తేదీలు, కావల్సిన దర్శనం, అర్జిత సేవల వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
ప్రముఖుల సిఫారసు లేఖతో వచ్చే భక్తులు తమ ఆధార్ నంబర్లు, ఆ బృందం ప్రధాన వ్యక్తి ఫోన్ నంబర్ తెలియజేయాలి. వసతి, దర్శనం, అర్జిత సేవల వివరాలపై ఎస్సెమ్మెస్ తెలిపేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం వెల్లడించింది. సిఫారసు లేఖపై దైవ దర్శనం చేసుకునే వారు తమ లేఖల అసలు ప్రతులను దేవస్థానం వసతి కల్పన కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని శ్రీశైలం దేవస్థానం తెలిపింది. ఆ సిఫారసు లేఖ, వాట్సాప్ లేదా దేవస్థానం అధికారిక మెయిల్‌కు వచ్చిన లేఖ సరిపోల్చుకున్న తర్వాత సంబంధిత భక్తులకు వసతులు కల్పిస్తామని దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు.