Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులు, భక్తుల నుండి అధిక ధరలు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ అనిత వ్యాపారులను హెచ్చరించారు. శుక్రవారం క్షేత్ర పరిధిలో పలు దుకాణాలలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేశారు. క్షేత్ర పరిధిలో దేవదాయశాఖ నిబంధనలకు విరుద్దంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, నిత్యావసర వస్తువుల ఎంఆర్పీ ధరలపై రూ.10-20 అధికంగా వసూలు చేస్తున్నారని భక్తులు ఫిర్యాదులు ఇచ్చారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా తాము తనిఖీలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
ప్రధానంగా ఆలయ పరిసరాల్లో దుకాణాలు, సిద్దరామప్ప షాపింగ్ కాంప్లెక్స్, కొత్తపేట, శ్రీ గిరికాలనీ తదితర ప్రాంతాల్లోని కిరాణా, ఫ్యాన్సీ, కూల్డ్రింక్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఆయా దుకాణాల యజమానులకు రూ.5000 నుండి రూ.15 వేల వరకు జరిమానా విధించినట్లు తెలిపారు. ఇదే విషయమై ఆలయ ఈవో లవన్నతో కూడా చర్చించినట్లు అనిత తెలిపారు.
క్షేత్ర పరిధిలో ఏర్పాటైన వ్యాపార కేంద్రాల్లో నిర్ణీత ధరల పట్టిక ఏర్పాటు చేయడం తప్పనిసరి అని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల నుండి అధిక ధరలు వసూలు చేసే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.