Tirumala | వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో భక్తులు వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పునరుద్ఘాటించారు. ఆదివారం ఉదయం తిరుమలలోని శ్రీవారి ఆలయ మాఢవీధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను బీఆర్ నాయుడు పరిశీలించారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు సంయమనం పాటించి తిరుపతిలో జారీ చేయనున్న ఎస్ఎస్డీ టోకెన్లు పొందాలని కోరారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వైకుంఠ ఏకాదశికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు.
జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్లైన్లో టికెట్లను పొందని భక్తులకు నేరుగా తిరుమల, తిరుపతిలో ఎస్ఎస్డీ టికెట్లు ఇచ్చేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు.
తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేశారు.
జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నారు.