TTD | భక్తుల గోవింద నామస్మరణ మధ్య తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఐదో రోజు గురువారం ఏడు కొండలు భక్త జనులతో సంద్రంగా మారిపోయాయి. శ్రీవారి గరుడ వాహన సేవను అలరించేందుకు లక్షల మంది భక్తులు తిరుమలకు పోటెత్తారు.
బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు గురువారం రాత్రి శ్రీ వారు తనకు ఎంతో ఇష్టమైన, ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఏనుగులు, ఆశ్వాలు ఠీవిగా ముందుకెళ్తుండగా, భక్తుల కోలాటం, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల మధ్య శ్రీవారి గరుడ వాహన సేవ కోలాహాలంగా సాగింది.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. గరుడ వాహన సేవకు భారీగా భక్త కోటి తరలి రావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తిరుమల ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల కదలికలపై ఆంక్షలు విధించింది.