అమరావతి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ దసరా ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. కనక దుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
పురాణాల ప్రకారం అమ్మవారు లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గమాతగా వెలుగొందింది. దుర్గమాసురుడిని వధించిన తర్వాత ఇంద్ర కీలాద్రిపై స్వయంగా అమ్మవారు వెలసింది. దుర్గే దుర్గతి నాశని అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది. శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది. దివ్యరూపిణి అయిన దుర్గమ్మ దర్శనం సకల శ్రేయోదాయకమని భక్తుల నమ్మకం.