Tirumala | తిరులమ శ్రీవారి ఆలయం తరహాలోనే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో జే శ్యామలరావు ప్రకటించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించారు. ఆలయంలో ప్రస్తుతం ఉన్న ఐనా మహల్, యాగశాల, పోటు, ప్రసాదాల పంపిణీ కౌంటర్లను తనిఖీ చేశారు.
ఆలయంలో ఎలక్ట్రికల్ కంట్రోల్ రూమ్‌ను ఆలయం బయటకు మార్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందని ఆలయ అధికారులను ఆదేశించారు. ఆలయం ఎదుట ఉన్న వాహన మండపం, ఆస్థాన మండపం కింద ఉన్న సెల్లార్ క్యూలైన్లు, పాత డిప్యూటీ ఈవో కార్యాలయం, ఆలయ నాలుగు మాఢవీధులు, పద్మసరోవరాన్ని పరిశీలించి.. పలు సూచనలు చేశారు. ఆయన వెంట జేఈవో వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్ ఉన్నారు.