Pawan Kalyan | టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పీకర్ స్థానంలో కూర్చోవడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దశాబ్దాలుగా అయ్యన్నపాత్రుడి మాటల వాడీవేడీని రాష్ట్ర ప్రజలు చూశారని.. ఇప్పుడు స్పీకర్గా ఆయన హుందాతనాన్ని చూస్తారని తెలిపారు. అయితే తనకు ఒక్కటే బాధగా ఉందని.. ఇకపై ఆయనకు తిట్టే అవకాశం లేదంటూ చమత్కరించారు. ‘ మీకు కోపం వస్తే.. రుషికొండను చెక్కినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు.. కానీ ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు. ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీరే కంట్రోల్ చేయాలి’ అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తొలి ప్రసంగంలో చమత్కారాలు చూపించడంతో సభ అంతా నవ్వులతో నిండిపోయింది.
గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు ఉండేవని పవన్ కల్యాణ్ అన్నారు. బూతులు, దూషణలతో రాష్ట్రాభివృద్ధిని వెనక్కి నెట్టారని విమర్శించారు. వ్యక్తిగత దూషణ కారణంగానే వైసీపీ 11 సీట్లకు పరిమితమయ్యారని పేర్కొన్నారు. గెలుపును స్వీకరించినట్లుగా ఓటమిని వైసీపీ నాయకులు స్వీకరించలేకపోయారని.. అందుకే అసెంబ్లీ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు.
భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదని.. భాష మనుషులను కలపడానికే గానీ విడగొట్టడానికి కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి అని తెలిపారు. ఎంత జటిలమైన సమస్యలనైనా సరే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. సభ హుదాతనాన్ని కాపాడి, భవిష్యత్ తరాలకు ప్రామాణికంగా నిలపాలని స్పీకర్ను కోరారు. విభేదించడం అంటే ద్వేషించడం కాదని.. వాదించడం అంటే కొట్టుకోవడం కాదని స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి మౌలికమైన పదాలు అని తెలిపారు. సభలో ప్రజాసంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలని అన్నారు. వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలని సూచించారు. వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడదని చెప్పారు.