అమరావతి: ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని వచ్చిన ఫిర్యాదుకు స్పందిస్తూ ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు తరుఫున ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా అందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేస్తూ లోకాయుక్తను కూడా కేసులో పార్టీగా చేర్చాలని సూచించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది .
అశోక్‌బాబును శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. అతడిపై సెక్షన్ 477A, 465, 420 కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చారని మెహర్ కుమార్ అనే ఉద్యోగి అశోక్ బాబుపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అశోక్‌బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గీతామాధురి సీఐడీకి ఫిర్యాదు చేశారు.