అమరావతి : ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా (Former minister Roja ) తీవ్రంగా స్పందించారు. మంగళవారం జరిగిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికార కూటమికి చెందిన ప్రభుత్వ నాయకుల దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం ఓటమి పాలయ్యిందని ట్విటర్ వేదికలో ఆరోపించారు.
పోలింగ్ కేంద్రానికి వైసీపీ కార్పొరేటర్లతో వస్తున్న ఎంపీ గురుమూర్తి బస్సుపై రాళ్లతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు, కిడ్నాపులతో తిరుపతిలో అరాచకం సృష్టించారని ఆరోపించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు వైసీపీ విప్ జారీ చేసిందని, కూటమికి ఒకే కార్పొరేటర్ ఉంటే డిప్యూటీ మేయర్ పదవి ఎలా సాధ్యమయ్యిందని ప్రశ్నించారు. విప్ ధిక్కరించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అంతిమంగా ఒకటే చెపుతున్నామని, `మేము ఓడి గెలిచాం.. వారు గెలిచి ఓడిపోయారు`ని అన్నారు. వైసీపీ ఓడిపోలేదు.. వ్యవస్థల ఉదాసీన వైఖరి, అధికార దుర్వినియోగం గెలిచిందని పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన అప్రజాస్వామిక ఎన్నికను ఏడుకొండలపై ఉన్న వెంకన్న స్వామితో పాటు ప్రజలు గమనిస్తున్నారని , సమయం వచ్చినప్పుడు కచ్ఛితంగా వారు సమాధానం చెపుతారని అన్నారు.