అమరావతి : ఏపీలో చంద్రబాబు( Chandrababu ) అణచివేత చర్యలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) ఆందోళన వ్యక్తం చేశారు. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని ట్విటర్ ( Twitter ) లో ఆరోపించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారని వెల్లడించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న వైసీపీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్‌బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయమని అన్నారు
. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు బీపీ ఎందుకు వస్తోంది ? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్ గారిపై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? అని అన్నారు.
మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదని పేర్కొన్నారు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించారని ఆరోపించారు. ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని వెల్లడించారు.
ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారని అన్నారు. ప్రభుత్వ అక్రమాలు, అణచివేతలు, కక్షసాధింపులపై తమ పోరాటం ఆగదని,ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుందని, ప్రజలకు అండగా ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.