ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై.. వజ్రోత్సవ సావనీర్‌ను విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీ షీలా రెడ్డి అతిథులకు స్వాగతం పలికిన ఈ కార్యక్రమానికి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేశ్ సింగ్ హాజరయ్యారు. ఎయిమ్స్ డైరెక్టర్, శ్రీ వేంకటేశ్వర కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ రణదీప్ గులేరియాను ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే, కథక్ ద్వయం శ్రీమతి కమిలినీ, శ్రీమతి నళినితోపాటు పదశ్రీ అవార్డు గ్రహీతలు, అత్యున్నత స్థానంలో పనిచేసిన పలువురు పూర్వ విద్యార్థులను కూడా ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు, శ్రీవేంకటేశ్వర కళాశాల విద్యారంగంలో చేపడుతున్న కృషిని అభినందించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాల న్యాక్ ఏ+ గ్రేడ్‌ను సాధించినందుకు అభినందనలు తెలిపారు. పరిశోధనల ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆయన.. భవిష్యత్‌లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కువ మంది పరిశోధుకుల వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళాశాలను ఆ దిశగా నడిపిస్తారన్న విశ్వాసాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటైన శ్రీ వేంకటేశ్వర కళాశాల 1961 లో ప్రారంభమైంది. శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్, కేఎల్ రావు, సీ అన్నారావుతో ప్రేరణ పొంది ప్రారంభమైన ఈ కళాశాల ఈ ఏడాది 60 వసంతంలోకి అడుగిడింది. డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సుస్థిర అభివృద్ధి కోసం ప్రాథమిక శాస్త్రం, మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ప్రతినిధితో ఫీల్డ్ ఇంటరాక్షన్ కార్యక్రమాలు, సదస్సులను, వర్క్‌షాపులను ఏడాది పొడవునా నిర్వహించారు. డిజిటల్ ఎకనామిక్స్, పేట్రియాటిక్ పాటల పోటీలపై వెబ్‌నార్ కూడా చేపట్టారు.