అమరావతి : ఆధారాలు లేకుండా తనపై ఎవరైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే వారిపై పరువు నష్టం దావా(Defamation) తో పాటు చట్టపర చర్యలు తీసుకుంటానని రాజంపేట వైసీపీ ఎంపీ (YCP MP ) మిథున్ రెడ్డి (Mithun Reddy) హెచ్చరించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దగ్ధం ఘటనలో తమ ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ఇమేజ్ను దెబ్బతీయడానికే కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమాలు చేశామని నిరూపిస్తే రాజకీయాలు(Politics) వదిలేస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిజాలు బయటకు వెల్లడించాలని కోరారు. తన కుటుంబం వందల ఎకరాలు ఆక్రమించామంటూ పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మదనపల్లె(Madanapalle) లో చిన్నఘటన జరిగితే రికార్డులు తారుమారు చేశారంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 30 ఏండ్లుగా వ్యాపారం చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇన్‌కం ట్యాక్స్‌లో ఉన్నాయి. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. గత పది ఎన్నికల నుంచి రాజకీయాల్లో ఉన్నామని, ఏనాడు కూడా తమకు పార్టీ ఫండ్ గాని, ఎన్నికల్లో ఖర్చుకు గాని ఎవరైనా డబ్బులిచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని స్పష్టం చేశారు.
రికార్డులు తారుమారు చేసేందుకే తమపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఎర్రచందనం (Redsandal) వ్యాపారం చేస్తున్నారని చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని కోరినా ఇంతవరకు స్పందన లేదని అన్నారు. మదనపల్లె ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా పోలీసులు ఇంకా ఎందుకు పురోగతి సాధించడంలేదని, నిజాలు బయటకు రావాలంటే విచారణను వేగవంతం చేయాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని ప్రకటించారు.