శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలో కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఈవో ఎస్. లవన్న తెలిపారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేకార్చనలు శాస్త్రోక్తంగా జరిపించారు. క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండగా, స్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉభయ దేవాలయాల్లో దర్శనాలు కల్పించి, తీర్థప్రసాదాలు అందించారు.
దేవస్థానానికి ఐఎస్వో ప్రశంసలు
శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు దేవస్థానం చేస్తున్న అభివృద్ది, ఏర్పాట్లకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్టైజేషన్ ( ఐఎస్వో ) ప్రశంసలు లభించాయి. నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేతుల మీదుగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్నకు అంతర్జాతీయ హెచ్‌వైఎం ధ్రువీకరణ సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య ఐఎస్వో ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, క్షేత్రానికి వచ్చే యాత్రికులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది నిరంతర కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రంలోనే తొలి ఆలయంగా గుర్తించి, గుడ్ హైజెనిక్ ప్రాక్టీసెస్ ( జీహెచ్‌పీ ) సంస్థ ధ్రువీకరణ పొందడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలొ హెచ్‌వైఎం సంస్థ అడ్వైజరీ బోర్డు చైర్మన్ టీ సుందరామయ్య, డైరెక్టర్ మైనిక, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.