Srisailam Dam | శ్రీశైలం జలాశయానికి రానున్న ఐదేళ్లలో కొత్త రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
శ్రీశైలం ప్రాజెక్టును ఆదివారం నాడు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించారు. పదో నంబర్ గేటు ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు. గేటు నుంచి నీటి లీకేజీ 10 శాతం కంటే తక్కువగానే ఉందని అన్నారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు. మరో ఐదేళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కన్నయ్య నాయుడు కోరారు. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్‌పూల్ ఉందని, దానివల్ల శ్రీశైలం ఆనకట్ట పునాదులకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.