Purandeswari | బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్యలు సరైనవే అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ బియ్యంపై తాము కూడా ప్రశ్నించామని గుర్తుచేశారు. ఇప్పుడు బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పవన్ కల్యాణ్ చూపించిన చొరవ సంతోషకరమని అన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడికైనా వెళ్లి విచారణ చేసే అర్హత పవన్ కల్యాణ్‌కు ఉందని స్పష్టం చేశారు.
విజయవాడలో బీజేపీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ శనివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందని తెలిపారు. ఏపీలో మూడు బలమైన పార్టీలు ఉన్నా సరే బీజేపీలో 25 లక్షల మంది చేరారని పేర్కొన్నారు. సంస్థాగత ఎన్నికలు, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు.
అదానీ వ్యవహారంలో జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని పురంధేశ్వరి అన్నారు. అదానీతో జగన్ ఒప్పదంపై అమెరికా లేఖను పూర్తిగా చదవాలని సూచించారు. అమెరికా రాసిన లేఖలో 4 రాష్ట్రాల పేర్లు ఉన్నాయని తెలిపారు. ఇదంతా జగన్‌కు తెలియకుండానే జరిగిందా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.