Cyclone Montha | మొంథా తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ మొంథా.. ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. భద్రాచలం పట్టణానికి సమీపంలో ఉన్న ఈ తీవ్ర వాయుగుండం రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
మొంథా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన ఆరు గంటల్లో 15కి.మీ. వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలిందని పేర్కొంది. ఇవాళ ఉదయం 8.30 గంటల సమయానికి తెలంగాణ ప్రాంతంలో 17.3 ఉత్తర అక్షాంక్షం, 81.2 తూర్పు రేఖాంశంలో భద్రాచలానికి 50 కి.మీ. దూరంలో, ఖమ్మం పట్టణానికి తూర్పున 110 కి.మీ. దూరంలో ఇది కేంద్రీకృతమైందని చెప్పింది. నైరుతి దిశలో ఒడిశాలోని మల్కాన్గిరికి 130 కి.మీ. దూరంలో, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు 220 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఇది ఏపీ, దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని చెప్పిందది. రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసింది. కోస్తా జిల్లాలో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.