AP Cyclone Update | ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం నాటికి అది తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. దీని ప్రభావంతో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ప్రస్తుతం ఆగ్నేయ బంగాఖాళాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన మూడు గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని పేర్కొన్నారు. రేపటికి ఆగ్నేయ, దాని పక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని తెలిపారు. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, దానికి పక్కనే ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని, ఆదివారం నాడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం నాటికి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.