Cyclone Montha | మొంథా తుపాన్ ప్రభావంతో ఏపీలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు.. దుర్గ గుడి ఘాట్ రోడ్డును మూసివేశారు. తుపాన్ తీరం దాటాక సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని ఈవో ఆదేశించారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు కనకదుర్గా నగర్, లిఫ్ట్ మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు.
తుపాన్ ప్రభావంతో విజయవాడ బస్ స్టేషన్ నుంచి వెళ్లే సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ బస్ స్టేషన్ నుంచి దాదాపు 400 బస్సు సర్వీసులు నడిచేవి. కానీ తుపాన్ నేపథ్యంలో 139 బస్ సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. విజయవాడ నుంచి కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వెళ్లే బస్సులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు లేక విజయవాడ బస్టాండ్ వెలవెలబోయింది.