అమరావతి : మొంథా తుపాన్ ( Cyclone Montha effect ) వల్ల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రాథమిక నష్టం అంచనాను ప్రభుత్వం తయారు చేసింది. వారం రోజుల పాటు తీర ప్రాంతాల జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలను అతలాం కుతలమైన ప్రభావిత జిల్లాలను సీఎం చంద్రబాబు ( Chandra babu ) హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నష్టం వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మొంథా ప్రభావం వల్ల రాష్ట్రానికి రూ. 5,265 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు వెల్లడించారు. ఆర్అండ్బీకి రూ. 2,079 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 829 కోట్లు, ఉద్యాన పంటలకు రూ. 39 కోట్లు, మత్స్యరంగానికి రూ. 1,270 కోట్ల నష్టం జరిగిందన్నారు. నీటిపారుదల రంగానికి రూ. 207 కోట్లు, తుపాను వల్ల ఎవరూ చనిపోలేదని పేర్కొన్నారు. 120 పశువులు చనిపోయాయని వివరించారు.
కూటమి ప్రభుత్వం అప్రమత్తత వల్ల నీటిపారుదల రంగానికి నష్టం తక్కువ వాటిల్లిందని తెలిపారు. గతంలో చెట్లు కూలితే తొలగించేందుకు వారం పట్టేదని, తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తూ ఇబ్బందులు లేకుండా చూశామని పేర్కొన్నారు. ముందస్తు చర్యల వల్ల నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు.